ప్రముఖ ఆలయాలకు పాలకమండళ్లు

సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లోని మూడు ప్రముఖ ఆలయాలకు రాష్ట్ర ప్రభుత్వం పాలక మండళ్లను నియమించింది. విజయవాడ, సింహాచలం, ద్వారకా తిరుమల ఆలయాలకు పాలక మండళ్లను నియమిస్తూ గురువారం ఉత్తర్వులు వెలువరించింది. ప్రిన్సిపల్‌ కార్యదర్శి ఉషారాణి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. పాలకమండళ్లలో పదహారుగురు చొప్పున సభ్యులను నియమించారు. మూడు ఆలయాల్లోని ప్రధాన అర్చకులు ఎక్స్‌అఫిషియో సభ్యులుగా ఉంటారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సింహాచలం, ద్వారకా తిరుమలలో వ్యవస్థాపక కుటుంబ సభ్యులు చైర్మన్‌గా వ్యవహరిస్తారని వెల్లడించింది. దుర్గ గుడి పాలక మండలి చైర్మన్‌గా పైలా సోమినాయుడును ఎన్నుకునే అవకాశం ఉందని సమాచారం. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హామీ మేరకు ఆలయాల పాలకమండళ్లలో మహిళలకు పెద్దపీట వేశారు.